సర్వ కార్య సాధక ధ్యానం

అసాధ్య సాధక!స్వామిన్!అసాధ్యం తవ కిం వదరామదూత! కృపాసింధో!మత్కార్యం సాధయ ప్రభో!

Monday, October 10, 2011

శ్రీహనుమజ్జన్మస్థల సముద్ధరణోద్యమము

శ్రీహనుమజ్జన్మస్థల సముద్ధరణోద్యమము

 శ్రీరామ, జయహనుమాన్!
శ్రీహనుమజ్జన్మస్థల సముద్ధరణోద్యమము


భక్తమహాశయులారా!
శ్రీరామచంద్రుడు అయోధ్యలో జన్మించాడని, ఆ ప్రాంతవాసులు ధన్యులని భావిస్తున్నాము. కాని రామకార్యధురంధురడయిన శ్రీహనుమంతుడు మన సమీపంలోని తిరుమల – తిరుపతిలో అంజనాద్రిపై జన్మించిన విషయం పురాణాలలో స్పష్టంగా తెలుపబడినా మనం ధన్యులమని భావించటంలేదు. అసలు చాలమందికి ఈ సత్యం తెలియదు. ఆ లోపమునకు హనుమద్భక్తులయిన మనమే బాధ్యత వహింపవలసియున్నది.
హనుమజ్జన్మస్థలమున ఎట్టి భవ్యమందిర నిర్మాణమును జరుగలేదు. పైగా యాత్రికులకు కనీస ప్రయాణవసతులు, స్నాన, నివాసయోగ్యతులుకూడా లేవు. భక్తులు కోరనందునే అవి జరుగుటలేదు.
Anjanaadri

కాబట్టి హనుమజ్జన్మస్థలంగూర్చి యావత్సమాజము తెలిసికొనుటకు, అచ్చట ప్రయాణవసతి సౌకర్యము లేర్పరచుటగూర్చి సంబంధిత అధికారులను పూనుకొనజేయుటకు హనుమద్విషయ పరిశోధకులు, హనుమచ్చక్తి జాగరణసమితి పూర్వాంధ్ర అధ్యక్షులు, హనుమదుపాసకులు డా. అన్నదానం చిదంబరశాస్త్రి గారి మార్గదర్శంలో ఈ ఉద్యమము స్వీకరించాము. వేలయేండ్లుగా మరుగున పడియున్న హనుమజ్జన్మస్థలంగూర్చి మన ప్రయత్నంతో సమాజం గ్రహించుట, మన ఉద్యమంతో ఆస్వామి అందరిసేవ లందుకొనుట మన అదృష్టము. కావున మీరీ ఉద్యమంలో తప్పక భాగస్వాములయి హనుమదనుగ్రహమునకు పాత్రులగుదురుగాక! శ్రీహనుమజ్జన్మస్థలం గూర్చి పూర్తి ప్రమాణాలతో గూడిన డా. ఎ.వి.యన్.జి. హనుమత్ప్రసాద్ విరచిత ‘శ్రీహనుమజ్జన్మస్థలం – అంజనాద్రి’ అను గ్రంధం రూ. 10/- లకే ఉద్యమ కార్యాలయం చిరునామాలో లభించును.


చేయవలసిన పని: మీద్వారా వేలాది జనుల సంతకసేకరణ జరగాలి. సంతకములు ఏదో ఒక కాగితముపైకాక ఉద్యమ నిర్ణీతమయిన A4 సైజు కాగితములపైననే జరపాలి. మీరు ఉద్యమ కేంద్రస్థానంనుండి పంపబడిన సంతకాల పత్రానికి కావలసినన్ని ఫోటోస్టాట్ కాపీలు తీయించుకొనాలి. మీ పరిసరగ్రామాలలో తెలిసినవారిద్వారా లేదా ఆంజనేయస్వామి ఆలయం లేదా ఇతర ఆలయాలు కేంద్రంగా చేసికొని అందరిచేత సంతకసేకరణ జరపండి.

ఉద్యమ నిర్ణీతమయిన A4 సైజు కాగితము : Link

కార్యకర్తలకు సూచన: SMSల ద్వారా కాని, Email ద్వారాకాని మీ పరిచితులందరకూ తెల్పి అలా వారినికూడా ఉద్యమంలో పాల్గొనజేయండి. మనకృషిని గుర్తించువాడు హనుమంతుడే. అందుకు తగిన అనుగ్రహాన్ని ప్రసాదించువాడూ హనుమంతుడే. కావున ఆయననే ప్రేరకునిగా గ్రహించి కార్యోన్ముఖులు కాగోరుచున్నాము. ఈ ఉద్యమం వెనుక హనుమత్ప్రేరణ కలదనుటకు నిదర్శనం ఈ ఉద్యమం భద్రాద్రి శ్రీరామచంద్రుని విజయదశమి శుభాశీస్సులు పొంది కొత్తగూడెంలో 09-10-2011న 108సార్లు 4000 మందితో ‘విరాట్ హనుమాన్ చాలీసా పారాయణ’ చేయించి ఆరంభింపజేసికొనుటే.
ముఖ్యగమనిక: ఈ ఉద్యమంలో భాగంగా ఎవ్వరూ ఎట్టిచందాలూ వసూలు చేయరాదు. ఎవ్వరికీ ఎట్టి విరాళాలు ఈయరాదు.


 Anjanaadri


ఉద్యమానికి స్వచ్చందంగా సహాయం చేయదలచినవారు డా. అన్నదానం చిదంబదరశాస్త్రి గారిపేర కార్యాలయం చిరునామాకు మాత్రమే పంపవచ్చును. ఫోటోస్టాట్ కాపీలు కూడా తీయింపలేని భక్తులు ఉదారులను అట్టిప్రతులు తీయించి యిమ్మని కోరవచ్చును. 100 పత్రాల సంతకసేకరణ చేసినవారంతా ఉద్యమ కార్యకర్తలుగా స్వీకరింపబడుదురు. జిల్లా ప్రతినిధులద్వారా కార్యకర్తలకు అనంతర సమాచారము అందింపబడును.
కావున వెంటనే కార్యోన్ముఖులై ప్రతివ్యక్తినీ ఈ హనుమత్సేవలో నిలుపగోరుచున్నాము. కాగితమునకు రెండువైపులా సంతకములు చేయించి కార్యాలయం చిరునామాకు పంప ప్రార్థన.
కార్యాలయం చిరునామా:
శ్రీహనుమన్నిలయం
మునిపల్లెవారివీధి, సంతబజారు,
చీరాల, ప్రకాశం జిల్లా, ఆం. ప్ర.
పిన్ కోడ్ – 523 155
ఇంతకుముందే ఈ వెబ్ సైట్ నందు ప్రచురించిన “శ్రీహనుమజ్జన్మస్థానము – అంజనాద్రి” అంశాన్ని చదివి భక్తులందరూ మరింత సమాచారాన్ని పొందగలరని అశిస్తూ, వెబ్ సైట్ లింకు ఇక్కడ పొందు పరుస్తాన్నాము.

శ్రీహనుమజ్జన్మస్థానము – అంజనాద్రి (The Birthplace of Sri Hanuman – Anjanaadri)


No comments:

Post a Comment