సర్వ కార్య సాధక ధ్యానం

అసాధ్య సాధక!స్వామిన్!అసాధ్యం తవ కిం వదరామదూత! కృపాసింధో!మత్కార్యం సాధయ ప్రభో!

Wednesday, May 4, 2011

హనుమంతుని కధలు – భీమునకు గర్వభంగం

హనుమంతుని కధలు – భీమునకు గర్వభంగం



ద్వాత్రిశత్భుజ ఆంజనేయ స్వామి

శ్రీ పరాశర సంహితనుండి హనుమంతుని కథలు
(రేడియో ప్రసంగములు)
శ్రీరామ
జయ హనుమాన్


శిష్యుడు – హనుమంతుడు భీమునికి కూడ గర్వభంగం చేశాడన భారతంలోని కధ విన్నాం, అదేమిటి గురువుగారు?గురువుగారు – ఆ! భీమునకూ గర్వభంగంజేసి అనుగ్రహించాడు. భారతంలో సౌగంధికా కుసుమం గూర్చి చెప్తే, పరాశర మహర్షి పురుష మృగాహరణం చెప్పారు. ఆయన ఇలా అన్నారు.
కోవా సమర్థో మైత్రేయ! సమున్మజ్జతు మంజసా
పరీవాహాద్భుతే మగ్నస్తత్కధామృత సాగరే’
‘ఓ మైత్రేయ మహామునీ! ఆ హనుమంతుని కధ అను అమృత సముద్రపు అద్భుత ప్రవాహంలో మునుగుతూ వెంటనే ఎవడు లేచిరాగలడు? కాబట్టి నీ వడిగిన మరొక్క కధకూడా విను. చెప్తున్నాను. ద్వాపరయుగంలో హస్తినాపురాన్ని కుంతీదేవి పెద్ద కుమారుడు, సద్గుణవంతుడు అయిన ధర్మరాజు పరిపాలిస్తూ ఉన్నాడు. ఆ పరాక్రమశాలి ఒకప్పుడు రాజసూయ మహాయజ్ఞాన్ని చేయ సమకట్టాడు. అక్కడ ధౌమ్యుడు మొదలైన పురోహితులచే చేయబడే ఆ యజ్ఞమునందు మనుజులకు పరిశుభ్రమైన శాలిధాన్యపు అన్నంతో సంతర్పణ జరిగింది. వివిధ భక్ష్యభోజ్యచోష్య లేహ్య పానీయాలు, లేగంటి ఆపుపాలు, అమృతాన్ని తిరస్కరింపజాలిన రసాలు, శరత్కాల పూర్ణ చంద్రునివలె శుభ్రమైన తెల్లనైన పెరుగులు, సకల జాతులవారికి స్త్రీ పురుష బాల వృద్ధ భేదం లేక సమర్పింపబడినాయి. వేద వేదాంగ వేత్తలే లెక్కకు మిక్కిలిగా ఉండగా ఇక సాధారణ జనులు ఇసుకవలె అసంఖ్యాకంగా వచ్చి భుజింపసాగారు. అటువంటి మహాయాగాన్ని అన్నగారు చేస్తున్న దానిని చూచి భీముడు ‘ఈ శుభ సందర్భంలో అన్నగారికి నే నేబహుమానం ఇచ్చిన బాగుంటుంది.’ అని అలోచించాడు. రత్నగర్భ అయిన భూమికే పతి అయిన ఈతనికి రత్నాలు సమర్పించటంతగదు. కోరిక లన్నిటిని ఇచ్చే దేవతల కామధేనువు వంటివి భూమిపై లభించేవికాదు. ‘భూమియందసాధ్యమైనది, రాజుకు గొప్పకీర్తి తెచ్చేది అయినదానినే తన శక్తిచే సాధించి ఇవ్వాలి’ అని తలచాడు. స్వర్గంలో పురుషమృగం యొక్క సంచారంవలన భోజనశాల లెల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంటాయి. కాబట్టి దానిని తేవలెనని భీమసేనుడు నిశ్చయించుకొని యజ్ఞశాలనుండి దేవసభ అయిన సుధర్మకు బయలుదేరాడు. తన బలమును చూచుకొన్న గర్వంతో కనుగప్పి ఉన్నవాడై తనకు ప్రమాదాని కల్గింపగల దని కూడా ఆలోచింపక, తనకుగల విశేష బంధువర్గాన్ని కూడా గుర్తింపక మనసుకు మించిన వేగంతో భీమసేనుడు ఉన్న చోటనుండి ఒక్కసారిగా బయలు దేరాడు.
ఇటువంటి కష్టమైన పనికి భీముడు పూనుకొనటం సర్వ ప్రాణులయందు దయగలవాడు, భీమునకు అన్న అయిన హనుమంతుడు గమనించాడు. సోదరుడయిన భీమునకు సాయపడదలచుకొన్నాడు. మిక్కిలి వేగంతో పరుగెత్తుచున్న భీమసేనుని త్రోవలోకి క్షణంలో చేరాడు. త్రోవకు అడ్డంగా కొండ చిలువ వంటి ఆకారం కల హనుమంతుడు పడుకొని ఉన్నాడు. శివలింగమయంగా తోచే తోకతో బాటనంతనూ ఆక్రమించి దూర ప్రయాణంచే అలసిఉన్న వానివలె నిశ్వాసలు విడుస్తూ ఉన్నాడు. పురుషమృగాన్ని తేవలెననే తొందరలోఉన్న భయంకరరూపుడైన భీముడు ఆ విధంగా అడ్డంగా ఉన్న హనుమంతుని చూచి ‘జరత్కపే! సుముత్తిష్ట-వాలం చాలయ వర్త్మనః గంతవ్యంతు మహాక్షిప్ర మితో అవసర సత్వరః’ – ‘ఓ ముసలి కోతీ! లే, నేను అవసరమైన పనిపై అతి వేగంగా ఇటు వెళ్ళాలి. త్రోవకడ్డంగా ఉన్న తోకను తీసెయ్యి. ముసలి వాడవైన కోతి చేష్ట మానలేదు. ఇలా వెళ్ళవలసిన బాటను తోకతో ఆవరించి కూర్చునావేమిటి? వన్యములైన ఆహారాలు ఏమీలేని ఈ పర్వత ప్రదేశంలో నీ కేమిపనిఉన్నాది? సరస్వతీ నదీతీర ప్రదేశాలకు వెళ్ళు. బాగాపండి తీయగఉండే మామిడి పండ్లు తినవచ్చు. తీయనైన నీరు త్రాగవచ్చు’ అని అన్నాడు. ఇలా తమ్ముడైన భీముడు బోధచేయగా హనుమంతుడు ముదుసలితనాన్ని వ్యక్తంచేసే చేష్టలతో అక్కడనుండి కదలలేదు.


 Read the rest of this entry »


by Dr Annadanam Chidambara Sastry

No comments:

Post a Comment