హనుమంతుని కధలు – ద్వాపరయుగంలో హనుమంతుడు
శిష్యుడు – గురువుగారూ! చిరంజీవి అయిన హనుమంతుడు ద్వాపరయుగంలో భారతకాలంలో కూడా ఉన్నాడన్నారు – ఆ విషయం కాస్త తెలియజేస్తే వినాలని ఉంది.
గురువుగారు – అలాగే, తప్పకుండా. చిరంజీవి కాబట్టి హనుమంతుని చరిత్రకు అంతంలేదు. ద్వాపరయుగ చరిత్రకు తప్పక వినవలసింది కాబట్టి చెప్పుకొందాం.
పాండురాజుకు కుంతి యందు ఇంద్రుని వరంవల్ల అర్జునుడు పుట్టాడు. అతనికే విజయుడు అనే పేరుకూడా ఉంది. సకల కళావిదుడైన అర్జునుడు మేటివిలుకాడు. సవ్యసాచిగా యుద్దంలో పరాజయం ఎరుగనివాడు. అతనికి అన్ని దిక్కులను జయించాలని కోరిక కల్గింది. సకల పరివారాన్ని వెంటబెట్టుకొని తూర్పు దిక్కుకు బయలుదేరాడు. ఆ దిక్కున ఉన్న శత్రు రాజులను జయించి వారిని వెంటబెట్టుకొని దక్షిణ దిక్కుకు వెళ్లాడు. తన వింటి త్రాటి మోతలచేతనే దక్షిణ దిక్కున ఉన్న శత్రు రాజులను కదల్చి వేసినవాడై క్రమంగా ఇంకా దక్షిణానికి వస్తూ సేతువును చూచాడు. దానిని చూచి ఆశ్చర్యపడి తన వెంట వచ్చినవారిలో పెద్దలు, పూర్వజ్ఞులు అయిన వారిని చూసి ‘అది ఏమిటి?” అని అడిగాడు. వారు అర్జునునితో ‘రాజా! రఘుకులశ్రేష్టుడైన రాముడు దురాత్ముడైన రావణుని వధించటంకోసం పెద్ద పెద్ద పర్వత శిలలతో సముద్రాన్ని బంధించాడు. నూరు యోజనాలు వ్యాపించిన ఇది సముద్రమునకు సేతువు’ అని చెప్పారు. ఆ మంత్రి సత్తముల, పండితుల వాక్యాలు, వివరణలు విని ఫల్గునుడు ఫక్కున నవ్వి ఇలా అన్నాడు. ‘స్వయంగా తాను ధనుస్సును పట్టగల్గి, బాణసంపదకూడా కల్గి ఉండి, ఆ రఘురాముడెందుకింత ప్రయాసననుభవించినట్లు? బాణ సమూహాన్ని బంధించి సముద్రం దాటటానికి అవకాశం ఉండగా ఆ మహాత్ముడు ఇంత ప్రయాస పడటానికి ప్రయోజన మేమిటో అర్థం కావటంలేదు’ అని విమర్శగా పల్కాడు.
రామనామం ఎక్కడ ఉచ్చరింపబడుతుందో అక్కడ హనుమంతుడుంటాడు. కాబట్టి రామవృత్తాంతం అలోచిస్తూ ఉండగానే అంజలి ఘటించి హనుమంతుడు అక్కడకి వచ్చాడు. గర్వమనే చీకటితో కప్పబడి ఉన్న నరునితో ఆ వానర శ్రేష్టుడు ‘ఓ రాజా! నీవే పరిహాసంగా ఇప్పుడు పల్కబడిన మాట ఉన్నదే. అది తప్పు. నీ మాటలు రమణీయంగా ఉన్నా విమర్శనా శుధ్దాలు కావు, యుక్తి సహితంగా లేవు. గొప్ప పర్వతాలతో సమానమైన ఎలుగుబంట్లు, కోతులు మొదలైన మహా బలగము బాణ సమూహంతో చేసిన మార్గాన సముద్రాన్ని ఎలా దాటగలదు? పక్షి వాలిన మాత్రం చేతనే బాణాలతో చేసిన వంతెన కూలుతుందే! అటువంటి మార్గాన్ని ఏ మనుష్య్డుడు విశ్వసించి ఏర్పాటు చేసుకొంటాడు? బాగా దాహం వేసినవాడికి మధురోదకం మాటుపరచి ఎండమావులు చూసినట్లుగా ఉంది నీ బాణాల వంతెన పద్దతి. లేకపోతే రఘుకుల శ్రేష్టుడు, సీతాపతి అయిన నా స్వామి తెలివి తక్కువ పని చేస్తాడా? నీ వ్యర్థ ప్రలాపాలు కట్టిపెట్టు’ అన్నాడు. అంతేకాదు, ఇంకా కావాలంటే పరీక్షించుకో. నీవు శర పంజరాన్నినిర్మించు. అది నన్ను భరింపగల్గితే ఏనుగులు, గుర్రాలు,రధాలతో కూడిన నా శ్రీ రామచంద్రుని సేనను వహింపగల్గినట్లే అని కూడా అన్నాడు.