మనకు ఏకైక ఆదర్శం – హనుమంతుడు, బుద్దిమతాం వరిష్టుడు
శ్రీ ప్రసన్నాంజనేయ అవతారము
బాహబల సాధనలో హనుమంతుని ఆదర్శంగా గ్రహించిన మనకు ఆయన బుద్ధిబలం విషయంలో సందేహం కల్గటం సహజం. ఎందుకంటే అంత ఆసాధారణ బాహుబలసంపన్నులకు బుద్దిబలం ఉండే అవకాశం లేదు. అవి రెండూ పరస్పరవిరుధ్ధ శక్తులు. అట్టి విరుద్దశక్తులు ఏకమై ఉండటం, గొప్పగా ఉండటమే హనుమంతునిలోని విశిష్ట లక్షణం. అసామాన్య బాహుబలం కల హనుమంతుడు బుద్దిమతాం వరిష్టుడు, జ్ఞానినా మగ్రగణ్యుడు.
మనోజవం మారుతతుల్యవేగం
జితేంద్రియమ బుద్దిమతాం వరిష్టమ్
వాతాత్మజం వానరయూధముఖ్యం
శ్రీరామదూతం శిరసా నమామి ||
జితేంద్రియమ బుద్దిమతాం వరిష్టమ్
వాతాత్మజం వానరయూధముఖ్యం
శ్రీరామదూతం శిరసా నమామి ||
అని కీర్తించనివారుండరు. కేవలం అలా కీర్తించటమేనా? అది యధార్థమా? అని అలోచిస్తే పై విషయం పూర్తి సత్యం. ఆ మహనీయుని బుద్ధిమతాం వరిష్టునిగా మనం గుర్తించటం కాదు. సాక్షాత్తు శ్రీరామచంద్రుడే గుర్తించాడు. శ్రీహనుమద్రాముల ప్రథమ సమావేశంలోనే ఆ గుర్తింపు కన్పడుతుంది.
రామలక్ష్మణులు సీతను అన్వేషిస్తూ పంపాతీర ప్రాంతానికి వచ్చారు. వారిని చూచిన సుగ్రీవడు వాలి తనను చంపుటకై పంపినవారుగా అనుమానించి వారి విషయం తెలిసికొని వచ్చుటకై హనుమంతుని పంపాడు. హనుమంతుడు రామలక్ష్మణులను కొన్ని ప్రశ్నలు వేస్తాడు. ఆ హనుమంతుని మాటలు వింటూనే రాముడు పల్కిన పల్కులలో హనుమంతుని వాక్చాతుర్యాన్ని ఎంతగానో పొగడడం తెలిసికొనగల్గుతాము. అలా హనుమంతుని బుద్ధిశక్తిని సాక్షాత్తు శ్రీరాముడే కొనియాడాడు. అసలు ‘హనుమంతుడు’ అంటే బుద్దిమంతుడు అని అర్థం అంటారు మధ్వాచార్యులవారు. ‘హనుశబ్దో జ్ఞానవాచీ చ హనుమా నితి శబ్ధతః’ అనేది వా రిచ్చినవివరణ.
అతులితబలధామం స్వర్ణశైలాభదేహం
దనుజవనకృశానుం జ్ఞానినా మగ్రగణ్యమ్
సకలగుణనిధానం వానరాణా మధీశం
రఘుపతిప్రియభక్తం వాతజాతం నమామి ||
దనుజవనకృశానుం జ్ఞానినా మగ్రగణ్యమ్
సకలగుణనిధానం వానరాణా మధీశం
రఘుపతిప్రియభక్తం వాతజాతం నమామి ||
అనే హనుమంతుని స్తుతిలో జ్ఞానినా మగ్రగణ్యుడుగా చెప్పబడ్డాడు. జ్ఞానము అనేది ప్రకటమయినప్పుడే గుర్తింపబడుతుంది. ఒక పండితుడు, ఒక పామరుడు ఇర్వురూ పట్టువస్త్రములు, శాలువాలు ధరించి కూర్చొనియున్నప్పుడు ఇర్వురను పండితులనియే భావిస్తాము. వారు నోరు తెరచి మాటాడినప్పుడు మాత్రమే వారిలో పండితుడెవరో, పామరుడెవరో గ్రహింపగల్గుతాము. ఆవిధంగానే బుద్ధిశక్తి వాగ్రూపంగానే తెలియబడుతుంది. ‘అతిరూపవతీ సీతా – అతివాజ్నిపుణః కపిః’ అని చెప్పబడింది. అంటే సీతాదేవివంటి అందగత్తెలేదు. ఆంజనేయునంతటి వాక్చాతుర్యం కలవాడు లేడు అని అర్థం. అలా బుద్ధిశక్తి హనుమంతుని వాక్చాతుర్యరూపంలో ఎప్పుడూ వెలువడుతూనే ఉంటుంది.
Read the rest of this entry »
by Dr Annadanam Chidambara Sastry
http://www.jayahanumanji.com/
No comments:
Post a Comment