హనుమంతుడు గంధమాదన పర్వత ప్రాంతంలో బంగారు అరటి తోటలలో నిత్యం నివసిస్తూ ఉంటాడు. ఏ కోర్కె లేనివాడైనా లోకానుగ్రహకాంక్షతో పరివారంతో కూడి శ్రీ రామచంద్ర పాదద్వయ ధ్యానతత్పరుడై ఉంటాడు. ఒకప్పుడు గరుత్మంతుడు తన బలాన్ని ఎంచుకొని గర్విస్తూ ఇలా అనుకున్నాడు. “దేవతలందుకాని, రాక్షసులందుకాని, నరులందుకాని,సర్పజాతియందుకాని యక్షులందుకాని నాయెదుట యుద్దంచేసి నిలువగల వాడెవ డున్నాడు? నన్నెదిరించి ప్రాణాలతో బ్రతుకగలవాడీ ముల్లోకాలూ గాలించినాలేడు. పర్వతాలు మోయటంలో కీర్తింపబడవచ్చు. కాని వానరులు కూడా నాతో సమానులెలా కాగలరు? నేను లోకమంతటిని ఉదరంలో వహించి దేవదానవులకు కదల్పటానికి కూడా శక్యంకాని దేహం కల్గిన సాక్షాత్తు నారాయణమూర్తినే నా రెక్కలమీద మోస్తున్నాను” అని అనుకొంటూ గర్వంతో గరుత్మంతుడు మైమరిచి ఉన్నాడు. ఇది తెలిసిన యదుకుల భూషణుడు శ్రీకృష్ణుడు ద్వారకానగరంలో సత్యభామతో రత్నసింహాసనం అధిష్టించిఉండి గరుత్మంతుని గర్వాన్ని పోగొట్టదలచి తనలో అతణ్ణి స్మరించాడు. వెంటనే అతి వేగంతో ఆ గరుడుడు వచ్చాడు. కృష్ణునకు అంజలి ఘటించి ఆజ్ఞకోసం నిరీక్షించాడు. అంతట కృష్ణుడు “ఓ వినతా తనయా! అమిత వేగము కలవాడా! మహాబల పరాక్రమ సంపన్నుడా! బంగారు అరటిచెట్లచే రమ్యమైన గంధమాదన పర్వతం మీద ధ్యానమగ్నుడై భక్త సులభుడు, ధర్మాత్ముడు అయిన హనుమంతుడున్నాడు. నేనాతనితో మాట్లాడవలసి ఉంది, కాబట్టి అతని నిక్కడికి తోడ్కొని రావలసింది” అని అజ్ఞాపించాడు. వైనతేయుడు మనసును మించిన వేగంతో తక్షణమే గంధమాదన పర్వతానికి వెళ్ళాడు. అక్కడ నిశ్చలంగా మనసున ధ్యానం చేసుకుంటూ ఉన్న వానర శ్రేష్టుడైన హనుమంతుని చూచాడు. అతని ఎదుట గర్వంగా నిలబడి గరుడుడు అనేక పర్యాయాలు పిలిచాడు. “ఓ వానరశ్రేష్టా! మహాత్ముడైన శ్రీకృష్ణుడు నిన్ను పిలుస్తున్నాడు. నీ యోగాన్ని చాలించు. ఓ మహాజ్ఞానీ! ఆలస్యం చేయకు. శ్రీకృష్ణుని శాసనం అతిక్రమింపతగనిది కాబట్టి నిన్ను తీసికొని వెళ్ళనిదే ఇక్కడనుండిపోను” అన్నాడు. స్థిర యోగంలో శ్రీరామచంద్రుని పాదద్వయమునందే ధ్యానముంచి నిశ్చలమనస్కుడై ఉన్న వానరవంశ శ్రేష్టుడైన హనుమంతుడు ఈ బాహ్య విషయాన్ని దేనిని గమనింపలేదు. అప్పుడు గరుత్మంతుడు కృష్ణాజ్ఞనాలోచించుకొని భయపడి హనుమంతునియందు అల్పభావంతో తన ముక్కుని హనుమంతుని ముక్కు రంధ్రంలోకి పోనిచ్చాడు సర్వ ప్రాణుల అంతః కరణములందు సంచరించే హనుమంతుడు, గరుత్మంతుడు చేసిన వికార చేష్టలను గుర్తించికూడా గుర్తించనట్లున్నాడు. ఇంకా నిశ్చలుడై మెదలకుండా ఉన్న మారుతి చెవికడ తన ముక్కునుంచి గరుత్మంతుడు మరల పిలిచాడు.
Read the rest of this Story »
శ్రీ పరాశర సంహితనుండి హనుమంతుని కథలు
(రేడియో ప్రసంగములు)